‘‘కల్యాణ్‌‌ అడిగారు, ఇచ్చాను’’: రేణు

Spread the love

‘‘కల్యాణ్‌‌ అడిగారు, ఇచ్చాను’’: రేణు
‘ఆయన మంచి తండ్రి అనడంలో సందేహం లేదు’

హైదరాబాద్‌: నటి రేణూ దేశాయ్‌ తన మాజీ భర్త, కథానాయకుడు పవన్‌ కల్యాణ్ నుంచి విడిపోయి ఏడేళ్లు అయ్యింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరు విడిపోవడంతో అప్పట్లో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత నటి అన్నా లెజినోవాను పవన్‌ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం పవన్‌, రేణు కలిసి తమ పిల్లలు అకీరా నందన్‌, ఆద్యల బాధ్యత చూసుకుంటున్నారు. పవన్‌ ఇప్పుడు తనకు మంచి స్నేహితుడని రేణు పలు సందర్భాల్లో చెప్పారు. అయితే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. పవన్‌తో విడాకులకు కారణం ఏంటని ప్రశ్నించగా.. తొలిసారి సమాధానం చెప్పారు.

కల్యాణ్‌‌ అడిగారు, ఇచ్చాను
‘కల్యాణ్‌ గారు విడాకులు అడిగారు. నాకు చాలా బాధేసింది, కోపం వచ్చింది. ఆయనకు విడాకులు ఇవ్వాలని నాకు ఏ మాత్రం లేదు. కానీ ఆయన అడగటంతో.. చివరికి ఒప్పుకుని ఇచ్చాను’.

ఆయన మంచి తండ్రి
‘కల్యాణ్‌ గారు మంచి తండ్రి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆయన తన పిల్లలతో కలిసి ఎన్ని రోజులు ఉన్నారు? రెండేళ్లలో ఓ రెండు రోజులు వారితో ఉంటారు. స్వతహాగా జీవించే ఓ మహిళ తన పిల్లలకు పరిపూర్ణమైన జీవితం ఇవ్వగలదని అందరు మహిళలకు చెబుతున్నా. ఓ పురుషుడి వల్ల మీ జీవితం అంతమైపోకూడదు’.

‘విడాకులు తీసుకుంటున్న సమయంలో ఓ ప్రకటన విడుదల చేయమని కల్యాణ్‌ గారిని కోరాను. కానీ ఆయన నా మాట వినలేదు. నాకు పవన్‌ మహిళా అభిమానుల నుంచి ద్వేషపూరితమైన సందేశాలు వచ్చాయి’.

ఆ బాధ నాకు తెలుసు
‘రెండో పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు చాలా ఒత్తిడి చేశారు. నాకు చేసుకోవాలని లేదు. ‘ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి. ఆయనతోనే బతకాలి, ఆయనతోనే చావాలి..’ ఇలా అనుకునే వ్యక్తిని నేను. కానీ మా వాళ్లు ఒప్పుకోలేదు. అందుకే చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విడాకులు ఇచ్చిన తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల ఒంటిగా ప్రయాణం చేశా. ఓ తల్లి పిల్లల్ని పెంచడం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలిసింది. ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు పిల్లలు పెద్దయ్యారు, స్కూలుకు వెళ్తున్నారు.. కాబట్టి పరిస్థితి వేరు. కానీ నేను విడాకులు తీసుకున్నప్పుడు వాళ్లు చాలా చిన్న పిల్లలు’.

‘కష్టం’ కన్నా మించిన పదం కావాలి
‘విడాకుల తర్వాత నా బాధను వర్ణించడానికి కష్టం కంటే మించిన పదం కావాలి. ఎవరైనా భవిష్యత్తులో సుఖపడతామని ఇప్పుడు కష్టాలు పడుతుంటారు. అలానే నేను ఉన్నా. అర్ధరాత్రి షూటింగ్స్, మీటింగ్స్‌.. అన్ని భరించాను. కానీ ఆ కష్టాలు పడ్డ తర్వాత కూడా మళ్లీ నాకు కష్టం వచ్చింది’.

రాజకీయం చేస్తారు
‘నేను బయటికి వచ్చి పవన్‌ గురించి ఓ మాట చెబితే అది రాజకీయం అయిపోతుంది. ‘పవన్‌ గురించి రేణు అలా అన్నారు’ అని వార్తలు రాస్తారు. ఓ సారి 2014లో ఓ ఇంటర్వ్యూ ఇచ్చా. అప్పుడు ఇలాంటి సంఘటన ఎదుర్కొన్నా. అప్పటి నుంచి నేను మౌనంగా ఉంటున్నా. నా భావాలు బహిరంగంగా వ్యక్తపరచడం లేదు’.

ఫన్నీగా అనిపిస్తుంది
‘నేను కొత్త జీవితం ప్రారంభిస్తున్నా. కానీ విమర్శలు మాత్రం తగ్గడం లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నిజాలు తెలుసుకోరు. నేను ఎం తప్పు చేశాను. కొన్ని సార్లు ఫన్నీగా అనిపిస్తుంది. 100 మందిలో 90 మంది బావుంటారు, 10 మంది మాత్రం తిడుతుంటారు. 2013 వరకు నాకు సోషల్‌మీడియా ఖాతాలు లేవు. నాకు వాటిపై ఆసక్తి లేదు. కానీ ఆ తర్వాత నిర్మాతగా మారాక ఖాతాలు నడపాల్సి వచ్చింది. అప్పటి నుంచి బూతులు తిడుతున్నారు. నేను డబ్బు మనిషి అన్నారు. నాకు పెళ్లి కుదిరింది. వాళ్లు ఎందుకు విడాకులు ఇచ్చారని అడిగారు. నీ తప్పు లేనప్పుడు ఎందుకు ఇంత భరిస్తున్నావు అని ప్రశ్నించారు. నిజాన్ని ఎందుకు దాచాలి? అనే ఉద్దేశంతో చెబుతున్నా. నేను విడాకులు అడగలేదు. కల్యాణ్‌ గారికి కూడా ఇది తెలుసు. ఆయనే అడిగారు. నేను కోపం తెచ్చుకున్నా. చివరికి ఇచ్చేశా’.