‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ మేకింగ్‌ వీడియో 

Spread the love

‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’ మేకింగ్‌ వీడియో 
ముంబయి: భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌’. బాలీవుడ్‌ దిగ్గజాలు అమితాబ్‌ బచ్చన్‌, ఆమిర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షేక్‌ కథానాయికలుగా నటించారు. విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. 19వ శతాబ్దం తొలినాళ్లలో భారతదేశంలో తమ దోపిడీలతో అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వానికి సవాల్‌ విసిరిన థగ్స్‌ (దోపిడీదారులు) కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ఇందులో చూపించిన భారీ పడవలను ఎలా రూపొందించారో వెల్లడించారు.

1839లో వచ్చిన ‘కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ థగ్‌’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌, ఆమిర్‌..ఖుదాబక్ష్‌, ఫిరంగి అనే దోపిడీదారుల పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో సముద్రంలో పడవలపై జరిగే యాక్షన్‌ సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయట. వాటి కోసమే రెండు భారీ ఓడల సెట్లను రూపొందించారు. వాటి బరువే సుమారు 200 టన్నులట! హాలీవుడ్‌ సినిమాలకు పనిచేసిన విదేశీ డిజైనర్లు, ఓడ నిర్మాణ నిపుణుల సహకారంతో ఈ సెట్లను తీర్చిదిద్దారు.

ఏడాది పాటు సుమారు వెయ్యి మంది శ్రమించి ఈ సెట్లను సిద్ధం చేశారని చిత్రవర్గాలు వెల్లడించాయి. ఇదివరకు బాలీవుడ్‌లో ఏ సినిమాలోనూ చూడని విధంగా ఓడల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఉంటాయని, తెరపై వాటిని చూసినప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలగడం ఖాయమని చెబుతున్నారు. కుటుంబ, ప్రేమకథా చిత్రాలకు పేరుగాంచిన యశ్‌‌రాజ్‌ ఫిలింస్‌ తన పంథాకు భిన్నంగా నిర్మిస్తున్న తొలి యాక్షన్‌ ప్రధాన చిత్రమిది. అందుకే ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తెలుగు, తమిళం, హిందీలో ఒకేసారి సినిమాను విడుదల చేస్తున్నారు. దీపావళి సందర్భంగా నవంబర్‌ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *