త్రివిక్రమ్‌ సినిమా పోస్టర్లు.. ఇది గమనించారా!

Spread the love

త్రివిక్రమ్‌ సినిమా పోస్టర్లు.. ఇది గమనించారా!
సెంటిమెంట్‌గా మారిందా?

హైదరాబాద్‌: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాల తీరే కొత్తగా ఉంటుంది. ఆరు డైలాగులు‌, మూడు పంచ్‌లతో సినిమా వినోదభరితంగా సాగిపోతుంటుంది. కుటుంబ విలువలు, బంధాలు, జీవిత సత్యాలను జోడిస్తూ ఆయన రాసే డైలాగులకు యువతతోపాటు కుటుంబ ప్రేక్షకులు సైతం ఫిదా అవ్వాల్సిందే. ‘త్రివిక్రమ్ సినిమా’ అనే కారణంతో ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లిన రోజులు కూడా ఉన్నాయి. ‘నువ్వే నువ్వే’, ‘అతడు’, ‘జల్సా’, ‘జులాయి’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అ ఆ’ తదితర చిత్రాలకు ఎంత చక్కటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

కాగా త్రివిక్రమ్ సినిమా పోస్టర్లను చూస్తే అందులో ఓ విషయం కామన్‌గా కనిపిస్తోంది. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘అరవింద సమేత’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను తాజాగా విడుదల చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ బ్యాగ్‌ పట్టుకుని కనిపించారు. గతంలో త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ‘అజ్ఞాతవాసి’, ‘అ..ఆ’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘అతడు’ సినిమా పోస్టర్లలోనూ ఇదే విధంగా హీరోలు బ్యాగ్‌‌తో కనిపించారు. దీంతో ఈ విషయంపై నెట్టింట్లో చర్చ జరుగుతోంది. త్రివిక్రమ్‌ సెంటిమెంట్‌ ఫాలో అవుతున్నారని అంటున్నారు.

‘అ’ంత ప్రత్యేకం ఏంటో?

త్రివిక్రమ్‌ దర్శకుడిగా మొత్తం పది సినిమాల్ని తెరకెక్కించారు. అందులో ఐదు సినిమాల పేర్లు ‘అ’తోనే ప్రారంభం కావడం మరో విశేషం. ‘అతడు’, ‘అత్తారింటికి దారేది’, ‘అ ఆ’, ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’ సినిమాలు ఒకే అక్షరంతో మొదలయ్యాయి. ‘అజ్ఞాతవాసి’ తప్ప మిగిలిన నాలుగు సినిమాలు ప్రేక్షకుల మెప్పు పొంది, బాక్సాఫీసు వద్ద విజయం సాధించాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘అజ్ఞాతవాసి’ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. టైటిల్‌ ‘అ’తో ప్రారంభం కావడం గురించి ఓ సందర్భంలో త్రివిక్రమ్‌ మాట్లాడారు. సెంటిమెంట్‌ ప్రకారం టైటిల్‌ అలా పెట్టలేదని.. యాదృచ్ఛికంగా జరిగిపోయిందని అన్నారు.

‘అరవింద సమేత’ను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. పూజా హెగ్డే కథానాయిక. తమన్‌ బాణీలు అందించారు. నాగబాబు, ఈషా రెబ్బా, సునీల్‌, ఈశ్వరి, సితార తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌ ఆ ప్రాంతీయ యాసలో సందడి చేయనున్నారు. అక్టోబరు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *