నందమూరి ‘సీమ’ తడాఖా

Spread the love

నందమూరి ‘సీమ’ తడాఖా

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కంటపడ్డవా కనికరిస్తానేమో.. వెంటపడ్డావా నరికేస్తావోబా..’ అంటూ రాయలసీమ యాసలో ‘యంగ్‌ టైగర్’ ఎన్టీఆర్‌ పలికిన డైలాగ్‌ ప్రేక్షకులతో ఈలలు వేయించింది. ఆయన కథానాయకుడిగా నటించిన ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం అక్టోబర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఆది’ తర్వాత మళ్లీ తారక్‌ రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంలో కన్పించబోతున్నారు. అందులో ఆది కేశవరెడ్డిగా మెప్పించిన తారక్‌ ఇప్పుడు వీర రాఘవరెడ్డిగా అలరించబోతున్నారు. ట్రైలర్‌లో తన డైలాగులు, యాక్షన్‌తోనే సగం మార్కులు కొట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే నందమూరి కుటుంబానికి రాయలసీమ‌ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు కొత్తేం కాదు.

బాలయ్య విశ్వరూపం..!
ఫ్యాక్షన్‌ సినిమాలంటే తెలుగు చిత్ర పరిశ్రమలో మొదట గుర్తొచ్చే కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. రాయలసీమ నేపథ్యంలోఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. ‘సమర సింహారెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘సీమసింహం’ తదితర చిత్రాల్లో ఆయన యాక్షన్‌, డైలాగ్‌ డెలివరీకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ‘సమరసింహారెడ్డి’, ‘చెన్న కేశవరెడ్డి’ చిత్రాల్లో బాలకృష్ణ ఉగ్రరూపాన్ని చూపించారు. ఒక సినిమాకు మించి మరో సినిమాలో ఆయన డైలాగ్‌లు పలకడం విశేషం. ‘నేను తొడ కొడితేనే గుండె ఆగి చస్తావురా’, ‘కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా’ వంటి డైలాగ్‌లు ఎంత పాపులర్‌ అయ్యాయో అందరికీ తెలిసిందే.

సీతయ్య ఉగ్రరూపం!
‘సీతయ్య ఎవ్వడిమాటా వినడు’ అంటూ దివంగత నటుడు హరికృష్ణ చెప్పిన డైలాగులు ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. వైవీఎస్‌ చౌదరి దర్శకత్వంలో హరికృష్ణ కథానాయకుడిగా నటించి చిత్రం ‘సీతయ్య’. సౌందర్య, సిమ్రన్‌ కథానాయికలుగా నటించారు. ఇందులో హరికృష్ణ పవర్‌ఫుల్‌ పోలీసు అధికారి పాత్రలో కన్పించారు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విజయఢంకా మోగించింది.

రామయ్య రౌద్ర రూపం!
‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’ ఈ డైలాగ్‌ ఎవర్‌గ్రీన్‌. తొలినాళ్లలో ఎన్టీఆర్‌కు స్టార్‌డమ్‌ను అందించి ఆకాశంలో నిలబెట్టిన చిత్రం ‘ఆది’. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ‘ఈ సీమలో మొదట కత్తి పట్టింది మా తాత.. బాంబు చుట్టింది మాతాత వాటితో నువ్వేంట్రా నన్ను చేసేది’ అంటూ పవర్‌ఫుల్‌డైలాగ్‌లతో ఎన్టీఆర్‌ అదరగొట్టేశారు. సంగీతం పరంగానూ ఈ సినిమాకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వి.వి.వినాయక్‌ దర్శకత్వంలోనే ఎన్టీఆర్‌ నటించిన ‘సాంబ’ కూడా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే కావడం గమనార్హం. ఇది కూడా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘దమ్ము’లోనూ ఎన్టీఆర్‌ తనదైన నటనతో మెప్పించారు.

ఇప్పుడు తారక్‌ మరోసారి రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. ‘ఆది’లో తారక్‌ ఎక్కువగా రాయలసీమ యాసలో డైలాగులు పలకలేదు. కానీ, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘అరవింద సమేత’లో తారక్‌ చెప్పే ప్రతీ డైలాగ్‌ రాయలసీమ యాసలోనే ఉండబోతోంది. చిత్తూరు కుర్రాడిగా కన్పిస్తాడని, డైలాగులు కూడా ఆ యాసలోనే ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదల చేసిన, టీజర్‌, ట్రైలర్లకు విశేష స్పందన వస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ చిత్రం అక్టోబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి త్రివిక్రమ్‌ మాట.. ఎన్టీఆర్‌ నోట ఎలా ఉంటుందో చూడాలట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *