దుర్గాపూజకు రూ.28కోట్లు.. అడ్డుకున్న కలకత్తాహైకోర్టు

Spread the love

దుర్గాపూజకు రూ.28కోట్లు.. అడ్డుకున్న కలకత్తాహైకోర్టు
అప్పుల సంగతేంటి అని ప్రశ్నించిన న్యాయస్థానం

కోల్‌కతా: పశ్చిమ్‌బంగాలో మమతాబెనర్జీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలో దుర్గాపూజ కోసం ఆమె కేటాయించిన రూ.28కోట్ల మంజూరును అడ్డుకుంటూ కలకత్తా హైకోర్టు స్టే విధించింది. నిధుల మంజూరును వచ్చే మంగళవారం వరకు నిలిపేయాలని ఆదేశించింది. రాష్ట్ర ఖజానా నుంచి దుర్గాపూజకు పెద్ద మొత్తంలో డబ్బు కేటాయించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులోని డివిజన్‌ బెంచ్‌ విచారణ జరిపింది.

‘ఏ నిబంధనలపై డబ్బు కేటాయించారు? ఏవైనా మార్గదర్శకాలు ఉన్నాయా? కేవలం దుర్గా పూజకే డబ్బు కేటాయిస్తారా.. ఇతర పండుగలకు కూడా కేటాయిస్తారా? డబ్బు తీసుకున్న వారు వాటిని దుర్వినియోగం చెయ్యకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రభుత్వానికి ఉన్న అప్పుల మాటేమిటి? ఓ వైపు అప్పులు ఉన్నాయని చెప్తున్నారు.. మరోవైపు ఇలా డబ్బు కేటాయిస్తున్నారు దీన్ని ఎలా సమర్థించుకుంటారు?’ అని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కోర్టు లేవనెత్తిన ప్రశ్నలన్నింటికి తదుపరి విచారణలోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.

మమతా బెనర్జీ ఈ ఏడాది దుర్గా పూజ కోసం రూ.28కోట్లు కేటాయిస్తున్నట్లు గత నెలలో ప్రకటించారు. కోల్‌కతాలోని 3000 పూజా కమిటీలకు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25వేల కమిటీలకు ఒక్కోదానికి రూ.10వేల చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అడ్వకేట్‌ సౌరభ్‌ దత్తా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *