తారక్‌కు ఉన్న మంచి లక్షణాల్లో అదొకటి

Spread the love

తారక్‌కు ఉన్న మంచి లక్షణాల్లో అదొకటి
ఆయనతో మరోసారి కలిసి పనిచేయాలని అనుకుంటున్నాను: పూజా హెగ్డే

హైదరాబాద్‌: తనపై నమ్మకం ఉంచినందుకు ‘అరవింద సమేత..’ చిత్రబృందానికి ధన్యవాదాలు చెబుతున్నారు కథానాయిక పూజా హెగ్డే. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. తమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. దసరా సందర్భంగా అక్టోబర్‌ 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చిత్రబృందంలోని ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెబుతూ పూజా ఓ వీడియోను సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు.

‘ ‘అరవింద సమేత..’ నాకు ఎంతో ప్రత్యేకమైన చిత్రం. ఈ సినిమా చిత్రీకరణ ఒక విహారయాత్రలా ఉండేది. చిత్రబృందానికి గుడ్‌ లక్‌. చినబాబు(రాధాకృష్ణ), వంశీ చాలా మంచి నిర్మాతలు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ విజయం సాధించాలని ఆశిస్తున్నాను. మా సినిమా కెప్టెన్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ నాకు సినిమాలో ‘అరవింద’ అనే మంచి పాత్రను ఇచ్చారు. నాపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు సర్‌. మీతో కలిసి మరోసారి పనిచేయాలని అనుకుంటున్నాను. మీరు సెట్స్‌లో చాలా ప్రశాంతంగా ఉంటారు కాబట్టే షూటింగ్‌ చాలా సరదాగా జరిగిపోయింది.’

‘ఈ సినిమాకు తమన్‌ అందించిన సంగీతం విని ఒళ్లు గగుర్పొడిచింది. పాటలకు నేను చాలా అలవాటుపడిపోయా. ఇక మా హీరో ఎన్టీఆర్‌ సర్‌ గురించి చెప్పాలంటే.. రోజూ ఎంతో ఎనర్జీతో సెట్స్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు సర్‌. సినిమా కోసం మీరు చూపించిన నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకం. ఇంత పెద్ద స్టార్‌ అయివుండి కూడా ఇతరులతో మీరు మీలాగే ఉంటారు. మీకున్న ఉన్నతమైన లక్షణాలలో ఇదొకటి. ఒక సహనటుడిలాగా ఇతరులు తమ పాత్రలో నటించడానికి ఎవరికి కావాల్సిన స్పేస్‌ వారికిస్తారు. ఎలా చేస్తారో తెలీదు ఒకటి రెండు టేక్స్‌తో సన్నివేశాన్ని పూర్తిచేసేస్తారు. సినిమా పూర్తయ్యాక మనమందరం పార్టీ చేసుకుందాం.’ అని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *