‘సిల్లీ ఫెలోస్’

Spread the love

‘సిల్లీ ఫెలోస్’

'సిల్లీ ఫెలోస్'

చిత్రం : ‘సిల్లీ ఫెలోస్’

నటీనటులు: అల్లరి నరేష్ – సునీల్ – చిత్ర శుక్లా – నందిని – జయప్రకాష్ రెడ్డి – పోసాని కృష్ణమురళి – రాజా రవీంద్ర  – ఝాన్సీ తదితరులు
సంగీతం: శ్రీ వసంత్
ఛాయాగ్రహణం: అనీష్ తరుణ్ కుమార్
నిర్మాతలు: భరత్ చౌదరి – కిరణ్ రెడ్డి  – వివేక్ కూచిభొట్ల
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు

కామెడీ హీరోలు అల్లరి నరేష్.. సునీల్ ఒకప్పుడు మంచి విజయాలందుకున్నారు. కానీ గత కొన్నేళ్లలో వారిని వరుస పరాజయాలు కుదేలు చేశారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి హిట్టు కోసం చేసిన ప్రయత్నం.. సిల్లీ ఫెలోస్. రీమేక్ చిత్రాల స్పెషలిస్టు భీమనేని శ్రీనివాసరావు తమిళంలో విజయవంతమైన ఓ చిత్రం ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వీరబాబు (అల్లరి నరేష్) ఒక టైలరింగ్ షాపు నడుపుతుంటాడు. అతను ఆ ఊరి ఎమ్మెల్యేకు తలలో నాలుకలా ఉంటాడు. ఐతే వీరబాబు చేసిన ఒక తప్పు వల్ల అతడి స్నేహితుడైన సూరి (సునీల్) సమస్యలో ఇరుక్కుంటాడు. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయికి సాయపడే క్రమంలో వీరబాబు కూడా ఇబ్బందుల్లో పడతాడు. అతడిని సమస్యల నుంచి బయట పడేయాల్సిన ఎమ్మెల్యే మతిస్థిమితం కోల్పోతాడు. దీంతో వీరబాబు.. సూరి దిక్కు తోచని స్థితిలో పడతారు. మరి వీళ్లు తమ సమస్యల నుంచి బయట పడటానికి ఏం చేశారన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

ఇంతకుముందు తెలుగులో కన్ఫ్యూజింగ్ కామెడీలు తెగ ఆడేస్తుండేవి. స్పూఫులు.. పేరడీలు బాగా వర్కువటయ్యేవి. అప్పట్లో కామెడీ కూడా చాలా లౌడ్ గా.. గోల గోలగా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల తీరు మారింది. ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది. ఇప్పుడంతా సిచువేషనల్ కామెడీని.. సటిల్ గా సాగిపోయే వినోదాన్ని ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. కానీ ఇలాంటి తరుణంలో భీమనేని అండ్ కో ‘సిల్లీ ఫెలోస్’తో తెలుగు ప్రేక్షకుల్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చెప్పుకోదగ్గ కథాకథనాలేమీ లేకుండా కేవలం లౌడ్ కామెడీని నమ్ముకుని లాగించేసిన సినిమా ఇది. తమిళంలో విజయవంతమైన ‘వేలయను వంద వేలైక్కారన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కథ ఒక తీరుగా ఉండదు. సన్నివేశానికి సన్నివేశానికి లింకుండదు. అసలెక్కడా లాజిక్ అనే మాటే కనిపించదు. కామెడీ వర్కవుటైతే ఏవి ఎలా ఉన్నా చెల్లిపోయేది. కానీ ఔట్ డేటెడ్ అయిపోయిన కామెడీ సీన్లు చాలా వరకు నవ్వుల పాలే అయ్యాయి తప్ప ప్రేక్షకులకు నవ్వు తెప్పించలేకపోయాయి. సినిమాలో ప్రతి సీన్ కూడా సిల్లీగానే అనిపిస్తుంది. అందుకే దీనికి ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్ పెట్టారేమో అనిపిస్తుంది.

‘సిల్లీ ఫెలోస్’ చూస్తున్నంతసేపూ అసలేముందని ఈ సినిమాను తమిళం నుంచి తెలుగులోకి తీసుకొచ్చారు అన్న సందేహం కలుగుతుంది. ఎంత కామెడీ సినిమా అయినప్పటికీ తమిళ జనాలు ఇంతటి సిల్లీ కథతో సినిమా తీశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి తమిళంలో ఈ చిత్రం విజయవంతం కావడానికి ప్రధాన కారణం.. కమెడియన్ సూరి చేసిన పాత్రే. ఆ క్యారెక్టర్ ఆద్యంతం వినోదం పంచుతుంది. సూరి తనదైన కామెడీ టైమింగ్ తో సినిమాను నిలబెట్టాడు. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఆ పాత్ర పేలవంగా తయారైంది. ఆ క్యారెక్టర్ చేసిన సునీల్.. ఒక్కటంటే ఒక్క సీన్లోనూ నవ్వించలేకపోయాడు. కామెడీ వేషాలు మానేసి చాలా ఏళ్ల పాటు హీరోగా కంటిన్యూ అయిపోవడంతో.. సునీల్ కామెడీ టైమింగ్ పూర్తిగా మిస్సయిపోయిన భావన కలుగుతుంది. కమెడియన్ గా ఒకప్పుడు అతడి ప్రతి ఎక్స్ ప్రెషన్.. ప్రతి డైలాగ్ నవ్వించేది. కానీ ‘సిల్లీ ఫెలోస్’లో సునీల్ ఏం చేసినా నవ్వించలేకపోయాడు. తమిళంలో సూరి వల్ల  హిలేరియస్ గా పండిన సన్నివేశాలే.. ఇక్కడ సునీల్ చేస్తుంటే అసలేమాత్రం నవ్వు రాకపోవడం సినిమాకు పెద్ద ప్రతికూలతగా మారింది. ఒరిజినల్లో ప్రధాన బలమైన క్యారెక్టరే ఇక్కడ తేలిపోవడంతో ‘సిల్లీ ఫెలోస్’ బలహీనంగా తయారైంది.

సునీల్ పాత్రను పక్కన పెట్టి చూసినా.. ‘సిల్లీ ఫెలోస్’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ముందే చెప్పినట్లు ఇందులో చెప్పుకోదగ్గ కథ లేదు. కథనమూ అంతంతమాత్రమే. లాజిక్ తో పని లేకుండా ఎలా పడితే అలా సినిమా సాగిపోతూ ఉంటుంది. సినిమా నిండా బోలెడన్ని కామెడీ క్యారెక్టర్లున్నా వినోదం పండలేదు. నరేష్ సైతం ఏమీ చేయలేకపోయాడు. అతడి పాత్రలోనూ ఏ విశేషం లేదు. ఉన్నంతలో జయప్రకాష్ రెడ్డి.. పోసాని కృష్ణమురళి కొంత మేర నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ల కామెడీ కూడా చాలా పాతగా అనిపిస్తుంది. మాస్ ప్రేక్షకులు కొంతమేర ఆ కామెడీతో కనెక్ట్ కావచ్చేమో. ఒక సీన్లో అల్లరి నరేష్.. ‘‘నేను నిప్పు లాంటి మనిషిని. కావాలంటే గూగుల్ చేసి చూస్కో’’ అంటాడు. మరో సీన్లో మత్తు స్ప్రే కొట్టరా అని విలన్ అంటే అతడి అసిస్టెంట్.. బాడీ స్ప్రే కొడతాడు. ఇంకో విలన్ని ఇన్ డీసెంట్ ఫెలో అని తిడితే.. వీడేంటి నన్ను ‘ఇంటిలిజెంట్ ఫెలో’ అంటున్నాడు అంటాడు. ఇలాంటి డైలాగులు.. సీన్లతో కామెడీ పండించే రోజులు కావివి. ఇలాంటి సిల్లీ డైలాగులు.. సిల్లీ సీన్లతోనే ‘సిల్లీ ఫెలోస్’ నిండిపోయింది.

నటీనటులు:

అల్లరి నరేష్ పర్వాలేదు. ఎప్పట్లాగే తనకు అలవాటైన రీతిలో నటించాడు. కానీ అతడి పాత్రలో ఏ ప్రత్యేకతా లేదు. నరేష్ కూడా ముందులా కామెడీ పండించలేకపోయాడు. ఇక సునీల్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. అతడి కామెడీ అసలేమాత్రం వర్కవుట్ కాలేదు. హీరోయిన్ చిత్ర శుక్లా గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఆమె ఏ రకంగానూ ఆకట్టుకోలేదు. జయప్రకాష్ రెడ్డి.. పోసాని కృష్ణ మురళి కొంత మేర నవ్వించారు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం:

శ్రీ వసంత్ పాటల్లో ఒక్కటీ గుర్తుంచుకోదగ్గది లేదు. పాటలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. నేపథ్య సంగీతమూ అంతంతమాత్రమే. తరుణ్ ఛాయాగ్రహణం కూడా మామూలుగా సాగిపోతుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. భీమనేని శ్రీనివాసరావు రీమేక్ కోసం ఎంచుకున్న సినిమానే సరైంది కాదు. తెలుగు సినిమాల్లో కామెడీ తీరు పూర్తిగా మారిపోయిన విషయాన్ని ఆయన గుర్తించనట్లే ఉంది. చాలా ఏళ్ల వెనుకటి శైలిలో సినిమాను నడిపించాడు. దర్శకుడిగా ఆయనేమాత్రం మెప్పించలేకపోయారు. సినిమాలో అన్ని అంశాలూ ఔట్ డేటెడ్ అనిపిస్తాయి.

చివరగా: సిల్లీ ఫెలోస్.. సిల్లీ సినిమా!

రేటింగ్- 1.5/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *